చామల జాబితాపై మహేశ్ గౌడ్ బ్రేక్!
హైదరాబాద్, నవంబర్ 10(ప్రజా ముద్ర న్యూస్) : తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, సమన్వయ లోపం మరోసారి బహిర్గతమయ్యాయి. పార్టీ మీడియా విభాగం నియామకాల విషయంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ మీడియా & పబ్లిసిటీ డిపార్ట్మెంట్ చైర్మన్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మధ్య నెలకొన్న విభేదాలు ఇప్పుడు గాంధీభవన్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. టీవీ డిబేట్లలో పార్టీ తరపున వాణి వినిపించేందుకు చామల కిరణ్ విడుదల చేసిన మీడియా ప్యానలిస్టులు, అధికార ప్రతినిధుల జాబితాను కేవలం 24 గంటల వ్యవధిలోనే పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ నిలిపివేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
అసలేం జరిగింది?
టీపీసీసీ మీడియా అండ్ పబ్లిసిటీ విభాగం చైర్మన్ హోదాలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం నాడు పార్టీ నూతన మీడియా ప్రతినిధుల జాబితాను ప్రకటించారు. ఇందులో 16 మందిని మీడియా ప్యానలిస్టులుగా, నలుగురిని మీడియా కో-ఆర్డినేటర్లుగా, మరో 49 మందిని అధికార ప్రతినిధులుగా నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా, ప్రస్తుతం అధికార ప్రతినిధులుగా కొనసాగుతున్న వారందరికీ సీనియర్ అధికార ప్రతినిధులుగా పదోన్నతి కల్పిస్తున్నట్లు ఆ ప్రకటనలో వెల్లడించారు.
ఈ 16 మంది ప్యానలిస్టుల జాబితాలో ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య, డాక్టర్ జె. రాంచంద్ర నాయక్‌లతో పాటు ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, టి. రామ్మోహన్ రెడ్డి, మేడిపల్లి సత్యం, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ వంటి కీలక ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతల పేర్లు ఉన్నాయి.
వెల్లువెత్తిన అసంతృప్తి.. పీసీసీ చీఫ్ ఆగ్రహం
జాబితా విడుదలైన కొద్దిసేపటికే పార్టీలో అసమ్మతి స్వరాలు భగ్గుమన్నాయి. కీలక నియామకాలు చేపట్టే ముందు సీనియర్లతో గానీ, పీసీసీ నాయకత్వంతో గానీ కనీస సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా జాబితాను ఎలా విడుదల చేస్తారని పలువురు నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అర్హులకు అన్యాయం జరిగిందని కొందరు నేరుగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో మహేశ్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు. ఈ నియామకాలపై తక్షణమే స్టే విధిస్తూ, తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ జాబితాను నిలిపివేస్తున్నట్లు మంగళవారం తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ప్రకటించింది.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ విప్‌లు వంటి బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న నేతలు జాబితాలో ఉన్నప్పటికీ, ప్రకటించిన మరుసటి రోజే దానిని హోల్డ్‌లో పెట్టడం పార్టీలో సమన్వయ లోపాన్ని స్పష్టం చేస్తోంది. ఈ వ్యవహారం రానున్న రోజుల్లో గాంధీభవన్ రాజకీయాల్లో ఎలాంటి మలుపులకు దారితీస్తుందోనని పార్టీ శ్రేణులు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
