వీరాపూర్‌లో రూ. 10లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభం
రాయికల్, నవంబర్ 10(ప్రజా ముద్ర న్యూస్) : జగిత్యాల జిల్లా రాయికల్ మండలం వీరాపూర్ గ్రామంలోని ఎల్లమ్మ ఆలయం సమీపంలో నూతనంగా 10 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని అన్నారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలతో పండుగ వాతావరణం నెలకొందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. వీరాపూర్–రామాజీపేట రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయడానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాయికల్ మండలంలో ఇప్పటివరకు 911 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, 732 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. వీరాపూర్ గ్రామంలో గతంలో 12 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా, రెండో విడతలో మరో 21 ఇళ్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తోందని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తోందని వివరించారు. మహిళా ప్రాధాన్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని అన్నారు. రానున్న రోజుల్లో ఎల్‌నినో ప్రభావం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని, విద్యుత్, నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో రైతుల సౌకర్యార్థం రైతుబజార్లు, మార్కెట్లను అభివృద్ధి చేయడం జరిగిందని, ఇవి రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారాయని అన్నారు. గతంలో నిర్లక్ష్యానికి గురై నిరుపయోగంగా మారిన రైతుబజారును నేడు హోల్‌సేల్ మార్కెట్ గా అభివృద్ధి చేసి రైతులకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పేర్కొన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగు రామస్వామి ఆత్మ చైర్మెన్ కాటిపెళ్ళి గంగారెడ్డి, ఏఎంసీ చైర్మెన్ రవీందర్ రావు, పిఎసిఎస్ చైర్మన్ ధీటీ రాజి రెడ్డి, ఏనుగు మల్లారెడ్డి, ఎంపీడీవో చిరంజీవి, ఎమ్మార్వో నాగార్జున, మాజీ సర్పంచ్ మల్లయ్య, ఉపసర్పంచ్ నర్సారెడ్డి కిషన్ రావు, పిఎసిఎస్ వైస్ చైర్మన్ స్వామి రెడ్డి, సీనియర్ నాయకులు కోల శ్రీనివాస్, బెజ్జంకి మోహన్ ప్రసాద్, మాజీ ఏఎంసీ చైర్మన్ గన్నె రాజిరెడ్డి, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు సురేందర్ నాయక్, సర్పంచులు, వార్డు సభ్యులు, రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
