డిసెంబర్ 15 నుండి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరిక
ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే భూపతి రెడ్డిలకు వినతిపత్రాలు
నిజామాబాద్ జిల్లా, నవంబర్ 13 (ప్రజా ముద్ర న్యూస్): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఆశా వర్కర్లకు నెలకు రూ. 18 వేల ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని, లేనిపక్షంలో డిసెంబర్ 15 నుండి నిరవధిక సమ్మెకు దిగుతామని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డికి మరియు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతి రెడ్డికి వేర్వేరుగా వినతిపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శంకర్ గౌడ్, ఉపాధ్యక్షుడు
ఏ. రమేష్ బాబు మాట్లాడుతూ… గత 20 ఏళ్లుగా ఆశా వర్కర్లు బడుగు, బలహీన వర్గాలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. గర్భిణీలు, బాలింతలకు అండగా నిలబడుతూ, సీజనల్ మరియు అంటువ్యాధుల నివారణలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు సబ్ సెంటర్లలో విధులు నిర్వహిస్తూ, ప్రభుత్వ సర్వేలలోనూ భాగస్వాములవుతున్నారని గుర్తు చేశారు.
అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నా, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచుతామన్న హామీని ప్రభుత్వం అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
