పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తా : జ్యోతి లక్ష్మణ్
జగిత్యాల, నవంబర్ 09(ప్రజా ముద్ర న్యూస్) : జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా పట్టణానికి చెందిన సీనియర్ నాయకురాలు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు
ఎర్రబెల్లి స్వర్ణ అధికారికంగా నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
పట్టణ ప్రథమ పౌరురాలిగా పనిచేసిన అనుభవం, ప్రజా సమస్యలపై ఉన్న అవగాహన దృష్ట్యా అధిష్టానం ఆమెకు ఈ కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ నియామకంపై జ్యోతి లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేస్తూ, పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో మహిళా కాంగ్రెస్ విభాగాన్ని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేస్తానని, మహిళలను రాజకీయంగా చైతన్యవంతులను చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని ఆమె పేర్కొన్నారు.
తనకు ఈ అరుదైన అవకాశం కల్పించడంతో పాటు నియామకానికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గాజంగి నందయ్యలకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నూతన అధ్యక్షురాలిగా నియమితులైన జ్యోతి లక్ష్మణ్‌కు పలువురు కాంగ్రెస్ నాయకులు, మహిళా కార్యకర్తలు అభినందనలు తెలిపారు.
