HomeUncategorizedడిసెంబర్ నాటికి కొడంగల్‌కు కృష్ణా జలాలు..

డిసెంబర్ నాటికి కొడంగల్‌కు కృష్ణా జలాలు..

📰 Generate e-Paper Clip

ఎవరు అడ్డుకున్నా తొక్కుకుంటూ వెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి

కొడంగల్, నవంబర్ 09(ప్రజా ముద్ర న్యూస్) : గత పదేళ్ల పాలనలో కేసీఆర్ రాష్ట్రాన్ని రూ. 8 లక్షల 11 వేల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టి ఫామ్ హౌస్‌లో పడుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొడంగల్ నియోజకవర్గంలో రూ. 9 వేల కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తనకు అప్పులు చేసే అలవాటు కానీ, అబద్ధాలు చెప్పే అలవాటు కానీ అసలే లేదని స్పష్టం చేశారు.

ఆ అప్పులకు మేం వడ్డీలు కడుతున్నాం..
గత ప్రభుత్వం చేసిన అప్పులకు, తప్పులకు తమ ప్రభుత్వం ప్రతీ ఏటా రూ. 80 వేల కోట్లు చెల్లిస్తోందని, గత 34 నెలల్లోనే రూ. 2 లక్షల కోట్లకు పైగా అప్పులు కట్టామని సీఎం వివరించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచి తాను ఏ ఒక్కరోజూ సెలవు తీసుకోలేదని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల కష్టాలను గుర్తించి, జనవరి 1, 2024 నుంచి రాష్ట్రంలోని 11 లక్షల మంది ఉద్యోగులకు ప్రతీ నెల మొదటి తారీఖునే జీతాలు చెల్లిస్తున్నామని గుర్తు చేశారు.

గడ్డం పెంచినంత మాత్రాన రేవంత్ కాలేరు: కేటీఆర్‌పై ఫైర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లపై రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. “చర్చకు రమ్మంటే కేసీఆర్ అసెంబ్లీకి రారు. ఇక కేటీఆర్‌కు గడ్డం రావడానికి 50 ఏళ్లు పట్టింది.. బుద్ధి రావడానికి ఇంకెన్నేళ్లు పడుతుందో తెలియదు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు.. గడ్డం మోకాళ్ల వరకు పెంచుకున్నా ఎన్నటికీ రేవంత్ రెడ్డి కాలేవు. పది జన్మలు ఎత్తినా ఆ గుండె ధైర్యం, నమ్ముకున్న వారి కోసం నిలబడే తెగువ నీకు రావు” అంటూ విమర్శించారు.

ఎల్లమ్మతల్లి సాక్షిగా కొడంగల్‌కు కృష్ణా నీళ్లు..
మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను బీఆర్ఎస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. కొడంగల్ అభివృద్ధి జరుగుతుంటే వారికి కడుపుమంట ఎందుకని ప్రశ్నించారు. “పోలేపల్లి ఎల్లమ్మతల్లిపై ఆన పెట్టి చెబుతున్నా.. ఎవరు అడ్డమొచ్చినా వారిని తొక్కుకుంటూ డిసెంబర్ నాటికి కృష్ణా జలాలను తీసుకొచ్చి కొడంగల్ బీడు భూములను తడుపుతాను. ఇక్కడి పొలాల్లో పచ్చని పంటలు పండించే బాధ్యత నాది” అని హామీ ఇచ్చారు.

ఎడ్యుకేషన్ హబ్‌గా కొడంగల్
గతంలో కొడంగల్ బిడ్డలు ఉన్నత చదువుల కోసం పక్క జిల్లాలకు, పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి ఉండేదని, నేడు కొడంగల్‌ను ఒక ‘ఎడ్యుకేషన్ హబ్’గా తీర్చిదిద్దుతున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో వేల కోట్ల పెట్టుబడులు తెచ్చి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. కొడంగల్ ప్రజల అండ ఉంటే ఢిల్లీలో మోదీనైనా, ఇక్కడ కేడీనైనా ఎదిరిస్తానని, నిరంతరం పనిచేసి తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబెడతానని పేర్కొన్నారు. సంక్రాంతి తర్వాత ‘ప్రజాబలం’ పేరుతో ప్రజల్లోకి రానున్నట్లు సీఎం ప్రకటించారు.

RELATED ARTICLES

Most Popular