ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన మేకల అక్షయ్ కుమార్..
శిథిలావస్థకు చేరిన తరగతి గదులు..
జన్నారం, నవంబర్ 02(ప్రజా ముద్ర న్యూస్) : మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరిందని, వెంటనే నూతన భవనాన్ని మంజూరు చేయాలని చింతగూడ గ్రామపంచాయతీ 2వ వార్డు సభ్యుడు, రాష్ట్ర విద్యార్థి సంఘం నాయకుడు మేకల అక్షయ్ కుమార్ కోరారు. సోమవారం మంచిర్యాల కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో భాగంగా ఆయన జిల్లా పాలనాధికారి (కలెక్టర్) కుమార్ దీపక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మేకల అక్షయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. చింతగూడ జడ్పీ పాఠశాలలో తరగతి గదుల పైకప్పులు పెచ్చులూడుతూ ప్రమాదభరితంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. శిథిలావస్థకు చేరిన ఈ భవనంలో విద్యార్థులు ప్రాణభయంతో చదువుకోవాల్సిన దుస్థితి నెలకొందని తెలిపారు.
పాఠశాలలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తక్షణమే నూతన భవన నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతులు ఇవ్వాలని కలెక్టర్‌ను కోరినట్లు ఆయన తెలిపారు. దీనితో పాటుగా విద్యార్థులకు ఆధునిక విద్యను చేరువ చేసేందుకు అటల్ టింకరింగ్ ల్యాబ్ తదితర ప్రయోగశాలలు ఏర్పాటు చేయాలని, డిజిటల్ లైబ్రరీ మరియు డిజిటల్ క్లాస్‌రూమ్స్ అందుబాటులోకి తీసుకురావాలని, పాఠశాల క్రీడాప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలని, ఈ సమస్యలన్నింటిపై విద్యాశాఖ అధికారులను అప్రమత్తం చేసి, ప్రభుత్వ ప్రత్యేక నిధులు మంజూరయ్యేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అక్షయ్ కుమార్ జిల్లా కలెక్టర్‌ను అభ్యర్థించారు.
