HomeUncategorizedవర్షాన్ని సైతం లెక్కచేయకుండా బీసీ-ఏ హక్కుల కోసం భద్రాద్రి కొత్తగూడెంలో మహోధ్యామం !

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బీసీ-ఏ హక్కుల కోసం భద్రాద్రి కొత్తగూడెంలో మహోధ్యామం !

📰 Generate e-Paper Clip

కలెక్టరేట్ ముట్టడి.. 200 మందికి పైగా హాజరు, ముదిరాజ్‌లను BC-A లో చేర్చొద్దని డిమాండ్

భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 03(ప్రజా ముద్ర న్యూస్) : బీసీ-ఏ వర్గాల హక్కుల పరిరక్షణ మరియు రిజర్వేషన్ల సాధన కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నడుమ భారీ ముట్టడి కార్యక్రమం నిర్వహించబడింది. కురుస్తున్న భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సుమారు 200 మందికి పైగా బీసీ-ఏ హక్కుల పరిరక్షణ ఉద్యమకారులు, నాయకులు ఈ ఆందోళనలో పాల్గొని తమ తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు.

ప్రధాన డిమాండ్లు:
ముదిరాజ్ కులాల వర్గీకరణపై వ్యతిరేకత: ప్రస్తుతం బీసీ-డి (BC-D) జాబితాలో ఉన్న ముదిరాజ్‌లను బీసీ-ఏ (BC-A) లో చేర్చేందుకు జరుగుతున్న ప్రతిపాదనను బీసీ-ఏ వర్గాలు తీవ్రంగా నిరసించాయి. ఈ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. ప్రస్తుతం బీసీ-ఏ జాబితాలో ఉన్న 57 అత్యంత వెనుకబడిన కులాల రిజర్వేషన్లు, చట్టబద్ధమైన హక్కులు దెబ్బతినకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని నాయకులు గళమెత్తారు.

ఈ సందర్భంగా పలువురు బీసీ-ఏ సంఘాల నాయకులు ప్రసంగిస్తూ, బీసీ-ఏ వర్గానికి కేటాయించిన రిజర్వేషన్లలో ఇతర కులాలను చేర్చడం వల్ల దశాబ్దాలుగా వెనుకబడిన 57 కులాల ప్రజలు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. వర్గీకరణలో ఖచ్చితమైన న్యాయ సూత్రాలను పాటించాలని, బీసీ-ఏ వర్గాల హక్కులకు భంగం కలిగించే ఏ ప్రయత్నాన్నైనా రాష్ట్రవ్యాప్తంగా తిప్పికొడతామని వారు హెచ్చరించారు.

వర్షంలోనూ వెనకడుగు వేయకుండా గంటల తరబడి సాగిన ఈ నిరసన ప్రదర్శనతో కలెక్టరేట్ ప్రాంగణం ఉద్యమ నినాదాలతో హోరెత్తింది. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు సమర్పించారు.

RELATED ARTICLES

Most Popular