PRAJA MUDRA NEWS
Newspaper Banner
Date of Publish : 15 November 2026, 9:27 am Posted by : PRAJA MUDRA NEWS

బాలల రక్షణే గ్రామ అభివృద్ధికి పునాది

 

పోరండ్లలో ఘనంగా బాలల గ్రామ సభ

సర్పంచ్ నక్క హరీష్ ఆధ్వర్యంలో పిల్లల సమస్యలపై సమగ్ర చర్చ

జగిత్యాల రూరల్, నవంబర్ 14 (ప్రజా ముద్ర న్యూస్) : బాలల రక్షణే గ్రామ అభివృద్ధికి అసలైన పునాది అని, గ్రామంలోని ప్రతి చిన్నారి బడికి వెళ్లి సంతోషంగా ఎదగాలని పోరండ్ల గ్రామ సర్పంచ్ నక్క హరీష్ ఆకాంక్షించారు. శనివారం జగిత్యాల రూరల్ మండలం, పోరండ్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన బాలల గ్రామ సభను ఘనంగా నిర్వహించారు. ఈ సభలో పిల్లల హక్కులు, వారి సంరక్షణ మరియు బాలల దుర్బలత్వ అంచనా వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు.

 

అర్హులైన పిల్లలకు ప్రభుత్వ అండ:

ఈ సందర్భంగా సర్పంచ్ నక్క హరీష్ మాట్లాడుతూ.. గ్రామంలోని 18 సంవత్సరాల లోపు పిల్లలందరి సమగ్ర వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా బడికి వెళ్లని పిల్లలు, చదువు మధ్యలో మానేసిన వారు, బాల కార్మికులు, అనాథలు, ఒంటరి తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్న పిల్లలు, దివ్యాంగులను గుర్తిస్తామన్నారు. అలాగే మత్తు పదార్థాలకు బానిసైన వారు, బాల్య వివాహాలు లేదా లైంగిక, శారీరక వేధింపులకు గురైన పిల్లలను గుర్తించి వారికి ప్రభుత్వం ద్వారా అందాల్సిన అన్ని రకాల సంక్షేమ, సహాయ సహకారాలను అందిస్తామని భరోసా ఇచ్చారు.

 

వివరాలు గోప్యంగా ఉంచుతాం:

గ్రామంలో ఏ చిన్నారికి ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని దాచకుండా తక్షణమే పంచాయతీ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. బాధిత పిల్లల పేర్లు, వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచి వారికి అండగా నిలుస్తామని వార్డు సభ్యులకు, గ్రామ ప్రజలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.