PRAJA MUDRA NEWS
Newspaper Banner
Date of Publish : 13 November 2026, 2:48 pm Posted by : PRAJA MUDRA NEWS

ధర్మపురి నియోజకవర్గంలో రూ. 1.20 కోట్లతో అభివృద్ధి పనులు

పలు పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ

కాళేశ్వరం బ్యారేజీ దిగువన నిలబడి పంపులు ఆన్ చేయాలని కేసీఆర్, కేటీఆర్‌లకు సవాల్

పెద్దపల్లి జిల్లా, నవంబర్ 13(ప్రజా ముద్ర న్యూస్) : ధర్మపురి నియోజకవర్గ పరిధిలో ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి సుమారు రూ. 1.20 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసినట్లు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ వెల్లడించారు. శుక్రవారం పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో పర్యటించిన ఆయన, పత్తిపాక మరియు నర్సింగాపూర్ గ్రామాల్లో రూ. 12 లక్షల ఎంపీ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా బోర్‌వెల్స్, సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రాధాన్యత క్రమంలో చేపడుతున్నట్లు తెలిపారు.

 

సంక్షేమం, ఉపాధి కల్పనకు పెద్దపీట

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని ఎంపీ పేర్కొన్నారు. రాష్ట్రంలో పెన్షన్ పథకం అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన ఆయన, విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోనూ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో నిరంతరాయంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

యువతకు ఉపాధి కల్పించే దిశగా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో ఏటీసీ శిక్షణ కేంద్రాల ద్వారా సుమారు 20 వేల మందికి నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని వివరించారు. అలాగే టామ్‌కామ్ ద్వారా సుమారు 10 వేల మంది తెలంగాణ యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

 

కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతలకు సవాల్

ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై బీఆర్ఎస్ నేత ల తీరును ఎంపీ వంశీకృష్ణ తీవ్రంగా విమర్శించారు. కాళేశ్వరం నిర్మాణం పేరుతో గత ప్రభుత్వం తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టిందే తప్ప, రైతులకు ఆశించిన స్థాయిలో సాగునీరు అందించలేకపోయిందని ఆరోపించారు. దివంగత నేత కాకా వెంకటస్వామి ఆశయమైన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహట్టి వద్ద నిర్మించి ఉంటే ఉత్తర తెలంగాణలో సాగునీటి కష్టాలు ఉండేవి కావని అభిప్రాయపడ్డారు.

కాళేశ్వరం ప్రాజెక్టును నాణ్యతతో నిర్మించామనే నమ్మకం కేసీఆర్, కేటీఆర్‌లకు ఉంటే, బ్యారేజీ దిగువన నిలబడి పంపులు ఆన్ చేయాలని ఆయన బహిరంగ సవాల్ విసిరారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ భద్రతా సూచనల మేరకు, మరమ్మతులు పూర్తయ్యే వరకు బ్యారేజీలో నీటిని నిల్వ చేయడం లేదని స్పష్టం చేశారు. ప్రజల భద్రతే ప్రభుత్వానికి ముఖ్యమని, నిపుణుల సూచనలను పట్టించుకోకుండా పంపులు ఆన్ చేయాలని కోరడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని మండిపడ్డారు.

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ‘నీళ్లు, నిధులు, నియామకాల’ పేరుతో అధికారంలోకి వచ్చి యువతకు ఎంతమేరకు ఉద్యోగాలు కల్పించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను ఆపేది లేదని, ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఎంపీ వంశీకృష్ణ స్పష్టం చేశారు.