ప్రజలకు అందుబాటులో బియ్యం ధరలు..
లక్షేట్టిపేట, నవంబర్ 10(ప్రజా ముద్ర న్యూస్) : సామాన్య ప్రజల
సంక్షేమమే లక్ష్యంగా, మార్కెట్‌లో బియ్యం ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా బియ్యం విక్రయ కేంద్రాలను (అవుట్‌లెట్లను) ఏర్పాటు చేస్తోందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ స్పష్టం చేశారు. మంగళవారం మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేటలో కొత్తగా ఏర్పాటు చేసిన రైస్ అవుట్‌లెట్‌ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుత ఎల్ నినో ప్రభావం వల్ల మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బియ్యం వ్యాపారులు, ట్రేడర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. సామాన్యులపై భారం పడకుండా బియ్యం ధరలను అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
అవుట్‌లెట్‌లో విక్రయించే బియ్యం ధరలు (26 కిలోల బస్తాకు).. బి.పి.టి. (BPT) కొత్త బియ్యం రూ. 1,352, హెచ్.ఎం.టి. స్టీమ్ బియ్యం రూ. 1,898, జై శ్రీరామ్ పాత బియ్యం రూ. 2,028 లకు మాత్రమే అమ్మాలి అని అన్నారు. నిర్వాహకులు కచ్చితంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ నిర్ణీత ధరలకే విక్రయాలు జరపాలని కలెక్టర్ ఆదేశించారు. నిబంధనలను అతిక్రమించి అధిక ధరలకు విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ధరల నియంత్రణను పర్యవేక్షించేందుకు రెవెన్యూ, పౌర సరఫరాల శాఖల అధికారులతో ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేశామని, ఆకస్మిక తనిఖీలకు వచ్చే అధికారులకు వ్యాపారులు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాములు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు నల్మాసు కాంతయ్య, కొత్త వెంకటేశ్వర్లు, రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మోటాపలుకుల సత్తయ్యతో పాటు పలువురు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.