తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళులు
రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు జరుపుకోవాలని సంఘం పిలుపు
హైదరాబాద్, నవంబర్ 10(ప్రజా ముద్ర న్యూస్) : గంగపుత్ర
సంఘ వ్యవస్థాపకులు, గంగపుత్ర జాతిపిత స్వర్గీయ సందిరి బాలయ్య 115వ జయంతి వేడుకలను తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని రెండు ప్రధాన ప్రాంతాల్లో ఘన నివాళుల కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సంఘం ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు.
జయంతి ఉత్సవాల్లో భాగంగా మొదట ఉదయం 9:00 గంటలకు అంబర్‌పేట్‌లోని తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం రాష్ట్ర కార్యాలయంలో, అనంతరం ఉదయం 11:00 గంటలకు అఫ్జల్‌గంజ్‌లోని నగర గంగపుత్ర సంఘం కార్యాలయంలో సందిరి బాలయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించనున్నారు.
సందిరి బాలయ్య శిష్యుడు సర్దార్ ఏ.ఎల్. మల్లయ్య ఆశయ సాధనే లక్ష్యంగా గంగపుత్రులందరూ ఐక్యంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా సంఘం నేతలు పేర్కొన్నారు. నగరంలోని వేడుకలకు రాష్ట్ర, నగర గంగపుత్ర సంఘాల నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు, కుల పెద్దలు మరియు గంగపుత్ర సోదర సోదరీమణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయంతి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.
అలాగే, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని గంగపుత్ర సంఘాలు తమతమ ప్రాంతాల్లో సందిరి బాలయ్య జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి, ఆయన ఆశయాలను స్మరించుకోవాలని ప్రదేశ్ గంగపుత్ర సంఘం పిలుపునిచ్చింది.