PRAJA MUDRA NEWS
Newspaper Banner
Date of Publish : 10 November 2026, 5:21 pm Posted by : PRAJA MUDRA NEWS

రేపు ఆచార్య సందిరి బాలయ్య 115వ జయంతి ఉత్సవాలు

హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా ఏర్పాట్లు..

రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు జరుపుకోవాలని ఉత్సవ కమిటీ పిలుపు

హైదరాబాద్, నవంబర్ 10(ప్రజా ముద్ర న్యూస్) : గంగపుత్ర జాతిపిత, సంఘసంస్కర్త ఆచార్య సందిరి బాలయ్య 115వ జయంతి ఉత్సవాలను ఆచార్య సందిరి బాలయ్య జయంతి ఉత్సవ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం (నవంబర్ 11) అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ.. గంగపుత్రుల అభ్యున్నతికి, చైతన్యానికి ఆచార్య సందిరి బాలయ్య చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. రేపు హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి వేడుకలకు కులబాంధవులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.

అంతేకాకుండా, హైదరాబాద్ రాలేని వారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తమ తమ గ్రామాలు, మండలాలు మరియు జిల్లా కేంద్రాలలో ఆచార్య సందిరి బాలయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి, జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని కమిటీ పిలుపునిచ్చింది.