PRAJA MUDRA NEWS
Newspaper Banner
Date of Publish : 09 November 2026, 9:32 pm Posted by : PRAJA MUDRA NEWS

వానర సైన్యం దండయాత్ర.. వణికిపోతున్న తీర్పెల్లి!

రహదారిపై కోతుల గుంపుల హల్‌చల్.. 

15 నిమిషాలు నిలిచిపోయిన రాకపోకలుగడప దాటాలంటేనే బెంబేలెత్తుతున్న గ్రామస్థులు, విద్యార్థులు

నివారణ చర్యలు చేపట్టాలని అధికారులకు స్థానికుల వేడుకోలు

లక్ష్మణచందా, నవంబర్ 09(ప్రజా ముద్ర న్యూస్) : నిర్మల్ జిల్లా లక్ష్మణచందా మండలం తీర్పెల్లి గ్రామ ప్రజలకు ప్రస్తుతం కోతుల బెడద కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గ్రామానికి చెందిన ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున కోతుల గుంపులు తిష్ట వేసి బీభత్సం సృష్టిస్తుండటంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

రద్దీ సమయంలో స్తంభించిన రాకపోకలు:

నిత్యం ప్రయాణికులు, కూలీలు, విద్యార్థులతో రద్దీగా ఉండే ఉదయం వేళల్లో వానర మూకలు ఒక్కసారిగా ప్రధాన రహదారిపైకి వచ్చి హల్‌చల్ చేశాయి. రోడ్డుకు అడ్డంగా గుంపులు గుంపులుగా కూర్చోవడమే కాకుండా, అటుగా వెళ్లే వాహనదారులపైకి దూసుకెళ్లే ప్రయత్నం చేశాయి. కోతుల దాడులకు భయపడి ప్రయాణికులు ఎక్కడికక్కడ తమ వాహనాలను నిలిపివేశారు. దీంతో సుమారు 15 నిమిషాల పాటు రహదారిపై రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.

గడప దాటాలంటేనే భయం:

గ్రామంలో కోతుల ఆగడాలు రోజురోజుకూ శ్రుతిమించుతున్నాయని తీర్పెల్లి వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం పిల్లలు బడికి వెళ్లాలన్నా, పెద్దలు తమ రోజువారీ పనులకు వెళ్లాలన్నా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఇళ్లలోకి సైతం చొరబడి వస్తువులను చిందరవందర చేయడంతో పాటు, అడ్డుకోబోయిన వారిపై దాడులకు తెగబడుతుండటంతో మహిళలు, వృద్ధులు ఇళ్ల నుండి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు.

“కోతుల బెడద నుండి కాపాడండి సారూ..”

గ్రామంలో నెలకొన్న ఈ తీవ్ర సమస్యపై అటవీ శాఖ మరియు సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కోతులను బంధించి, దూరంగా ఉన్న అటవీ ప్రాంతాల్లో వదిలిపెట్టడం ద్వారా తమకు ఈ వానర బెడద నుండి శాశ్వత విముక్తి కల్పించాలని తీర్పెల్లి గ్రామ ప్రజలు ముక్తకంఠంతో వేడుకుంటున్నారు.