కాషాయ కండువా కప్పి ఆహ్వానించిన జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్
మోడీ నాయకత్వంతోనే పార్టీలో చేరామన్న నేతలు

దస్తురాబాద్, నవంబర్ 09(ప్రజా ముద్ర న్యూస్) : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందిస్తున్న పటిష్ట నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం పెర్కపల్లి గ్రామానికి చెందిన పలువురు ముఖ్య నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరారు. సోమవారం బిజెపి నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ సమక్షంలో పెర్కపల్లి గ్రామానికి చెందిన విఎస్ఎస్ మాజీ చైర్మన్ గోపు రాజన్న, మాజీ టీ.సీ. మెంబర్ గడికొప్పుల శంకరయ్య, అప్పని నర్సయ్య, జి. చంద్రయ్య, బారా శంకరయ్యలు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ వారికి పార్టీ కండువాలు కప్పి బిజెపిలోకి సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ.. దేశాభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోడీ అందిస్తున్న దార్శనిక నాయకత్వంపై ఉన్న నమ్మకంతోనే తాము బిజెపిలో చేరినట్లు స్పష్టం చేశారు. జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ సారథ్యంలో పెర్కపల్లి గ్రామంలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేస్తూ, నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారానికి అండగా నిలబడతామని పేర్కొన్నారు. ఈ చేరికలతో పెర్కపల్లి గ్రామంతో పాటు దస్తురాబాద్ మండలంలో బిజెపి బలం మరింత రెట్టింపైందని స్థానిక నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.