PRAJA MUDRA NEWS
Newspaper Banner
Date of Publish : 09 November 2026, 9:55 pm Posted by : PRAJA MUDRA NEWS

పది జన్మలెత్తినా కేటిఆర్ రేవంత్ రెడ్డి కాలేడు.. లగచర్ల సభలో సీఎం తీవ్ర విమర్శలు

లగచర్ల సభలో సీఎం తీవ్ర విమర్శలు

హైదరాబాద్, నవంబర్ 09(ప్రజా ముద్ర న్యూస్) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం లగచర్లలో నిర్వహించిన ‘రైతన్నతో ఆత్మీయ సభ’లో పాల్గొన్న ఆయన, కేటీఆర్ వ్యవహారశైలిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తనకు పోటీగా నిలవడానికి కేటీఆర్ విదేశీ కన్సల్టెంట్లను నియమించుకున్నారని ఎద్దేవా చేశారు. వారి సలహా మేరకే తనలాగా గడ్డం పెంచుకుంటున్నారని విమర్శించారు. “ఎన్ని వేషాలు వేసినా పులి పులే.. నక్క నక్కే. కేటీఆర్ గడ్డం పెంచినా, పది జన్మలు ఎత్తినా ఎన్నటికీ రేవంత్ రెడ్డి కాలేరు” అని సీఎం ఘాటుగా వ్యాఖ్యానించారు.

నిజమైన నాయకుడిగా ఎదగాలంటే కేవలం బాహ్య రూపం మార్చుకుంటే సరిపోదని, అందుకు గుండె ధైర్యం, కార్యకర్తల అండదండలు, నమ్మిన వారి కోసం ప్రాణమిచ్చే త్యాగనిరతి ఉండాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నమ్మినవారినే నట్టేట ముంచే తత్వం ఉన్న కేటీఆర్ ఎప్పటికీ తన స్థాయికి రాలేరని అన్నారు.

కేటీఆర్‌కు గడ్డం రావడానికి 50 ఏళ్లు పట్టిందని, మరి బుద్ధి రావడానికి ఇంకెన్నేళ్లు పడుతుందో అని సీఎం వ్యంగ్యంగా ప్రశ్నించారు. కేటీఆర్ ఇకనైనా తన ‘పోకిరి వేషాలు, గంజాయి మాటలు’ మానుకోవాలని, ఈ విషయంలో ఆయన తండ్రి కేసీఆర్ అయినా కలుగజేసుకుని బుద్ధి చెప్పాలని రేవంత్ రెడ్డి హితవు పలికారు.