ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రత్యేక చొరవ- హర్షం వ్యక్తం రైతులు
ఖానాపూర్, నవంబర్ 09 (ప్రజా ముద్ర న్యూస్) : ఖానాపూర్ నియోజకవర్గంలోని రైతన్నలకు సాగునీటి కష్టాలు తొలగిపోతున్నాయి. జన్నారం, దస్తూరాబాద్ మండలాల రైతుల ఇబ్బందిని గుర్తించిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రత్యేక చొరవ తీసుకుని, కడెం ప్రాజెక్టు నుంచి శనివారం 700 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేయించారు.
పంటలకు సరిపడా నీరు అందక రైతులు అల్లాడిపోతున్న వైనాన్ని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ తీవ్రంగా పరిగణించారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించేందుకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు సంబంధిత ఉన్నతాధికారులతో ఆయన ఉన్నతస్థాయిలో చర్చలు జరిపారు. మంత్రులు, అధికారుల సానుకూల స్పందనతో తక్షణమే నీటి విడుదలకు మార్గం సుగమమైంది.
నీటిని పొదుపుగా వాడుకోవాలి: ఎమ్మెల్యే బొజ్జు పటేల్
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. రైతన్నల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. రైతులు సాగునీటి సమస్యతో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తున్నట్లు తెలిపారు.
అయితే, ఈ ఏడాది ఎల్నినో ప్రభావం కారణంగా వర్షపాతం తక్కువగా నమోదైందని, రాష్ట్రంలో నీటి కొరత తీవ్రంగా ఉందని ఆయన గుర్తుచేశారు. కాబట్టి, ప్రతి ఒక్క రైతు బాధ్యతాయుతంగా వ్యవహరించి, సాగునీటిని వృథా చేయకుండా అత్యంత పొదుపుగా వాడుకోవాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే చొరవతో ప్రాజెక్టు నుంచి నీరు విడుదల కావడంపై జన్నారం, దస్తూరాబాద్ మండలాల రైతులు హర్షం వ్యక్తం
చేస్తున్నారు. తమ పంటలకు మేలు జరుగుతుందని సంతోషం వెలిబుచ్చుతూ ఎమ్మెల్యేకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.