PRAJA MUDRA NEWS
Newspaper Banner
Date of Publish : 09 November 2026, 8:50 pm Posted by : PRAJA MUDRA NEWS

ఉట్నూర్‌లో ఘనంగా దండారి మహోత్సవాలు..

ప్రపంచ చరిత్రలో నిలిచిపోయేలా భారీ ఉత్సవాలు నిర్వహిస్తాం : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు

ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో యువత భాగస్వాములు కావాలని పిలుపు

ఉట్నూర్, నవంబర్ 09(ప్రజా ముద్ర న్యూస్) : ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే దండారి మహోత్సవాలు ఖానాపూర్ నియోజకవర్గం ఉట్నూర్ మండల కేంద్రంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు ఆదివాసీ కళాకారులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సంప్రదాయ వాయిద్యాలు, నృత్యాలతో ఉట్నూర్ పరిసరాలు సందడిగా మారాయి.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. ఆదివాసీల గొప్ప సంస్కృతి, సంప్రదాయాలు, జానపద కళలను భావితరాలకు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో వివిధ ప్రాంతాలకు చెందిన అనేక దండారి బృందాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, ప్రపంచ చరిత్రలో నిలిచిపోయేలా అత్యంత భారీ స్థాయిలో దండారి మహోత్సవాలను నిర్వహించేందుకు కృషి చేస్తానని ఆయన ప్రకటించారు.

ఆధునిక పోకడల నేపథ్యంలో ఆదివాసీ యువత తమ మూలాలను, పూర్వీకుల సంప్రదాయాలను ఎన్నడూ మరచిపోకూడదని ఎమ్మెల్యే సూచించారు. మన సంస్కృతిని గౌరవిస్తూ, దానిని ముందుతరాలకు అందించే బాధ్యతను యువత భుజాన వేసుకోవాలని, సంస్కృతి పరిరక్షణలో చురుగ్గా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ వేడుకల్లో ఆదివాసీ పెద్దలు, వివిధ గ్రామాల దండారి బృందాల నాయకులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు.