PRAJA MUDRA NEWS
Newspaper Banner
Date of Publish : 04 November 2026, 8:18 pm Posted by : PRAJA MUDRA NEWS

పురుగుల మందు తాగి ఆటో డ్రైవర్ ఆత్మహత్య

ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్‌కు నేత్ర దానం చేసిన కుటుంబ సభ్యులు..

జన్నారం, నవంబర్ 04(ప్రజా ముద్ర న్యూస్) : అప్పుల బాధతో మనస్తాపానికి గురై ఒక ఆటో డ్రైవర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జన్నారం మండలంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై ఉదయ్ కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బాదావత్ రాజ్‌నాయక్ (42) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవారు. ఆటో రిపేరు రావడంతో పాటు జీవనోపాధి కోసం మరో రెండు ఆటోలు కొనుగోలు చేయడంతో అప్పులు అయ్యాయి. అయితే నెల క్రితం ఒక ఆటో బోల్తా పడటంతో దానిని బాగు చేసుకోలేక, చేసిన అప్పులు తీర్చలేక, కుటుంబ పోషణ భారమై తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.

ఈ క్రమంలో నవంబర్ 3న రాత్రి చింతగూడ గ్రామ శివారులోని గోదావరి ఒడ్డున రాజ్‌నాయక్ పురుగుల మందు తాగి పడి ఉండగా గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే జన్నారంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య బాదావత్ కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

మరణంలోనూ మానవత్వం — నేత్ర దానం:
తన జీవితం ముగిసినా మరొకరి జీవితంలో వెలుగులు నింపాలనే సంకల్పంతో రాజ్‌నాయక్ కళ్లను ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్‌కు దానం చేశారు. పుట్టెడు దుఃఖంలోనూ ఈ ఉదార నిర్ణయం తీసుకున్న కుటుంబ సభ్యులను ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు, చింతగూడ గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు.