PRAJA MUDRA NEWS
Newspaper Banner
Date of Publish : 03 November 2026, 6:01 pm Posted by : PRAJA MUDRA NEWS

3 కోట్ల మంది అక్రమ చొరబాటుదారులు దేశంలోకి ఎలా వచ్చారు?

కేంద్ర హోంశాఖ వైఫల్యాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్, నవంబర్ 03(ప్రజా ముద్ర న్యూస్) : దేశంలో 3 కోట్ల మంది అక్రమంగా ఉంటున్నారని, వారి ఓట్లను తొలగించామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. గడిచిన 12 ఏళ్లుగా కేంద్రంలో బీజేపీయే అధికారంలో ఉన్నప్పుడు, అంతమంది అక్రమంగా దేశంలోకి ఎలా ప్రవేశించారో సమాధానం చెప్పాలని భువనగిరి ఎంపీ, టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దేశ సరిహద్దులను కాపాడటం, అంతర్గత భద్రతను పర్యవేక్షించడం కేంద్ర హోంశాఖ ప్రాథమిక బాధ్యత అని గుర్తుచేశారు. ఒకవేళ 3 కోట్ల మంది అక్రమ చొరబాటుదారులు దేశంలోకి వచ్చారనేది నిజమైతే, అది నేరుగా కేంద్ర హోంశాఖ వైఫల్యమే అవుతుందని స్పష్టం చేశారు.

ప్రజలకు స్పష్టత ఇవ్వాలి:
అమిత్ షా చెబుతున్న ఆ 3 కోట్ల మంది అక్రమదారులు ప్రస్తుతం ఎక్కడెక్కడ నివసిస్తున్నారు? వారి అడ్రస్‌లు ఎక్కడ ఉన్నాయి? వారు దేశంలో ఏం చేస్తున్నారు? అనే వివరాలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా రాజకీయ లబ్ధి కోసం, ఓట్ల తొలగింపు చర్యలను సమర్థించుకోవడానికి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై నిజానిజాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే దేశ ప్రజల ముందు ఉంచాలని కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.