PRAJA MUDRA NEWS
Newspaper Banner
Date of Publish : 03 November 2026, 8:58 pm Posted by : PRAJA MUDRA NEWS

హార్వెస్టర్ కింద పడి రైతు దుర్మరణం.. పెద్దమ్మగడ్డ తాండాలో విషాదం

వెల్దుర్తి, నవంబర్ 03(ప్రజా ముద్ర న్యూస్) : మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం పెద్దమ్మగడ్డ తాండాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. పొలంలో వరి కోతలు జరుగుతున్న సమయంలో హార్వెస్టర్ కింద పడి రైతు లంబాడి శంకర్ నాయక్ (46) ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దమ్మగడ్డ తాండాకు చెందిన లంబాడి శంకర్ నాయక్, తండ్రి మాన్సింగ్, గత పదేళ్లుగా కొండాటి అనుమంతరావుకు చెందిన మూడు ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం సుమారు 11:30 గంటల సమయంలో తన పొలంలో పండించిన వరి పంటను కోయించేందుకు గ్రామానికి చెందిన హార్వెస్టర్‌ను తీసుకెళ్లాడు.ఈ సమయంలో వరి కోతలు జరుగుతుండగా హార్వెస్టర్ ఆపరేటర్ వాహనాన్ని వెనక్కి తీసుకెళ్లాడు. ఆ సమయంలో శంకర్ నాయక్ హార్వెస్టర్ కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.మృతుడి భార్య లంబాడి బుజాలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెల్దుర్తి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై వెల్దుర్తి ఎస్ఐ బి. కరుణాకర్ రెడ్డి దర్యాప్తు చేపట్టారు.మృతుడు శంకర్ నాయక్‌కు భార్య, పిల్లలు ఉన్నారు. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి ఆకస్మికంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.