జనసంద్రమైన బీజేపీ ‘మహా పాదయాత్ర’
హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో హాజరైన లక్షలాది జనం
ఒకరికి రెండేసి ఓట్లు ఉండొచ్చా అంటూ నిలదీత
హైదరాబాద్, నవంబర్ 03(ప్రజా ముద్ర న్యూస్ – స్టేట్ బ్యూరో చీఫ్ తేజవ్యాస్) : భారత హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ లో సోమవారం మధ్యాహ్నం సుడిగాలి పాదయాత్ర నిర్వహించారు. ఆయన నేతృత్వంలో మహానగరంలో నిర్వహించిన మహా పాదయత్రకు వేలాది సంఖ్యలో బీజేపీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు తరలివచ్చి కదం తొక్కారు.
అడుగుడుగునా జై బీజేపీ నినాదాలతో మార్మోగిన యాత్ర మార్గం..ఎటు చూసినా కాషాయ జెండాలతో రెప రెపలాడింది. సర్ పై ప్రజల్లో అపోహలు సృష్టిస్తూ, ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేస్తున్న కాంగ్రెస్, ఇండీ కూటమి రాజకీయాలకు గట్టి సమాధానమిచ్చేలా నిజాం కాలేజ్ సమీపంలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి మొజంజాహి మార్కెట్ క్రాస్ రోడ్స్ వరకు పాదయాత్ర సాగింది.
ఒకే వ్యక్తికి రెండేసి ఓట్లు ఉండవచ్చా :
అనంతరం భారీ సభను ఉద్దేశించి మాట్లాడిన అమిత్ షా హైదరాబాద్‌ను నిజాం పాలన నుండి విముక్తి చేసి, భారత యూనియన్‌లో విలీనం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసిన చారిత్రాత్మక కృషిని గుర్తుచేసుకున్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు నిర్మూలించి అర్హులైన భారత పౌరుల ఓట్లు కాపాడేందుకు ఉద్దేశించిన సర్ ప్రక్రియను కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకిస్తోందని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. 13 కోట్ల ఓట్ల తొలగింపుపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ… ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉండటం, మరణించిన వారు, డూప్లికేట్ ఓట్లు, ఆచూకీ లేని ఓటర్ల పేర్లను తొలగించడం వల్లనే ఓటర్ల జాబితాలో మార్పులు జరిగాయని చెప్పారు. అలాంటి పేర్లు ఓటర్ల జాబితాలో ఎందుకు ఉండాలని ఆయన నిలదీశారు.
బీజేపీ ఎన్నికల విజయాలకు సర్ కారణమన్న రాహుల్ గాంధీ వాదనను అమిత్ షా తిప్పికొట్టారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ గారు గెలిచినప్పుడు ఎలాంటి సర్ ప్రక్రియ జరగలేదని గుర్తుచేశారు. మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ, అస్సాం, బీహార్, పశ్చిమ బెంగాల్‌లలో బీజేపీ విజయాలు ప్రజల మద్దతు వల్లే సాధ్యమయ్యాయని స్పష్టం చేశారు.
దమ్ముంటే సర్ పై ప్రత్యేక సమావేశానికి రండి :
సర్, ఈవీఎంలు అక్రమ చొరబాట్లు, కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు లేవనెత్తిన ఇతర అంశాలపై చర్చించేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశానికి బీజేపీ సిద్ధంగా ఉందని.. దమ్ముంటే హాజరు కావాలని రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలకు సవాల్ విసిరారు. పార్లమెంటు కార్యకలాపాలను అడ్డుకోవడం మానేసి, అర్ధవంతమైన చర్చల్లో పాల్గొనాలని కాంగ్రెస్‌కు హితవు పలికారు. తెలంగాణ, కేరళ, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడులో కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు గెలిచినప్పుడు ఈవీఎంలను అంగీకరించిన రాహుల్ గాంధీ, బీజేపీ గెలిచినప్పుడు మాత్రం ఈ ప్రక్రియను ఎందుకు ప్రశ్నిస్తున్నారని నిలదీశారు.
కాంగ్రెస్ పార్టీ కనుమరుగు :
దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ప్రాభవం కోల్పోతోందని, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, త్రిపుర, ఒడిశాలో దశాబ్దాలుగా ఆ పార్టీ అధికారానికి దూరంగా ఉందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఓటములకు సర్ కారణం కాదని, ప్రజలు తిరస్కరించడమే అనే విషయాన్ని గుర్తు పెట్టుకుంటే మంచిదన్నారు.
దిల్లీ కాంగ్రెస్’కి తెలంగాణ ఏటీఎంలా మారింది :
కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రాష్ట్రాన్ని ఏటీఎంలా మార్చేశారని, రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు తెలంగాణను ఎలా వాడుకుంటున్నారో ఎండగట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన ‘ఆరు గ్యారంటీలు’ కనీసం ఒక్కటి కూడా సరిగా అమలు కాని విషయాన్ని గుర్తు చేశారు. మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరిస్తూ… ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామమందిర నిర్మాణం, ట్రిపుల్ తలాక్ రద్దు, ఉగ్రవాదం మరియు నక్సలిజంపై ఉక్కుపాదం మోపిన వైనాన్ని గుర్తుచేశారు. భారతదేశాన్ని డ్రగ్స్ రహిత దేశంగా మార్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.

బీజేపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా పని చేయాలని పిలుపునిస్తూ.. తెలంగాణలో కాంగ్రెస్‌ను కూకటి వేళ్లతో సహా పెకిలించి, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఈ మహా పాదయాత్రలో బీజేపీ తెలంగాణ అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గోడం నగేశ్, అరవింద్ ధర్మపురి, డాక్టర్ కె. లక్ష్మణ్, ఎం. రఘునందన్ రావు, ఎమ్మెల్యేలు ఎ. మహేశ్వర్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, పాయల్ శంకర్, ఎమ్మెల్సీలు మల్కా కొమరయ్య, సి. అంజిరెడ్డి, పార్టీ నేతలు ఇతర ప్రముఖులు భాగస్వామ్యం అయ్యారు.