PRAJA MUDRA NEWS
Newspaper Banner
Date of Publish : 02 November 2026, 10:37 am Posted by : PRAJA MUDRA NEWS

నేడు హైదరాబాద్ బీజేపీ మహాపాదయాత్రకు భారీగా తరలిరావాలి : బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్కా యశస్వి పిలుపు

ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా

మధ్యాహ్నం 3 గంటలకు జగ్‌జీవన్ రామ్ విగ్రహం ప్రారంభం

హైదరాబాద్, నవంబర్ 01(ప్రజా ముద్ర న్యూస్ స్టేట్ బ్యూరో చీఫ్ తేజవ్యాస్) : ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘మహా పాదయాత్ర’ను జయప్రదం చే యాల ని భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్కా యశస్వి పిలుపునిచ్చారు.

ఈ చారిత్రాత్మక ప్రదర్శన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువతను, పార్టీ శ్రేణులను ఆయన భారీ ఎత్తున హాజరు కావాలని కోరారు.
ఈ సందర్భంగా మల్కా యశస్వి మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ బద్ధ సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు బషీర్‌బాగ్‌లోని బాబూ జగ్‌జీవన్ రామ్ విగ్రహం నుండి ప్రారంభమై ఎం.జె. మార్కెట్, ట్యాంక్ బండ్ వరకు సాగే ఈ మహా పాదయాత్రకు తెలంగాణ నలుమూలల నుండి యువత ప్రబల శక్తిగా తరలివస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరవుతున్న ఈ యాత్రను విజయవంతం చేసేందుకు బీజేవైఎం ఆధ్వర్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సాగే ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని యశస్వి పిలుపునిచ్చారు. నగరంలో ఎక్కడికక్కడ యువ శ్రేణులతో భారీ బైక్ ర్యాలీలు, స్వాగత తోరణాలతో పాదయాత్ర మార్గాన్ని సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా, అలాగే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పై ప్రతిపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీజేపీ “మహా పాదయాత్ర” లోక్‌తంత్ర బచావో – అరాచకత హటావో పేరుతో భారీ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
ఎన్నికల సంఘంపై నిందలు వేస్తూ, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ పై కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజల్లో తిప్పికొట్టడం, కాంగ్రెస్ అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే లక్ష్యంగా బీజేపీ ఈ యాత్రను చేపట్టింది.