హైదరాబాద్, అక్టోబర్ 30(ప్రజా ముద్ర న్యూస్) : నగరంలో నిత్యం ప్రయాణించే పౌరులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఇప్పటివరకు కేవలం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రయాణికులకు మాత్రమే పరిమితమైన ‘పుష్పక్ ఏసీ’ (Pushpak AC) బస్సులను ఇకపై సాధారణ ప్రజలు కూడా వినియోగించుకునేలా ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.
నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే సామాన్య ప్రయాణికులు కూడా ఈ లగ్జరీ ఏసీ బస్సుల్లో ప్రయాణించవచ్చు. వేసవి ఎండలు, నగర ట్రాఫిక్ నరకం నుంచి ఉపశమనం పొందుతూ హాయిగా ప్రయాణించేందుకు ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడనుంది. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులే కాకుండా, ఆయా రూట్లలో నగరంలోని ఏ పాయింట్ వద్దైనా ఎక్కి, తమ గమ్యస్థానం వద్ద దిగేందుకు అనుమతి ఇచ్చారు. ఈ లగ్జరీ ఏసీ ప్రయాణానికి రూ.100 కనీస ఛార్జీగా ఆర్టీసీ నిర్ణయించింది. సాధారణ సిటీ బస్సులతో పోలిస్తే వేగవంతమైన, అత్యాధునిక సౌకర్యాలు కలిగిన ప్రయాణ అనుభూతి సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది. ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, వ్యాపారులు, సాధారణ ప్రయాణికులకు ఇది మంచి ప్రత్యామ్నాయంగా మారనుంది.