Date of Publish : 30 October 2026, 3:41 pmPosted by : PRAJA MUDRA NEWS
రాహుల్ కాంబ్లే కుటుంబానికి న్యాయం చేయాలి: టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ వైస్ ఛైర్మన్ దుర్గం శేఖర్
ఆదిలాబాద్, అక్టోబర్ 30(ప్రజా ముద్ర న్యూస్) : ఆదిలాబాద్‌కు చెందిన రాహుల్ కాంబ్లే ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ వైస్ ఛైర్మన్ దుర్గం శేఖర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా దుర్గం శేఖర్ మాట్లాడుతూ.. రాహుల్ కాంబ్లే ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై, ఈ ఘటన వెనుక ఉన్న అన్ని కోణాలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు. ఆత్మహత్యకు కారణమైన వారిని గుర్తించి, బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయాలని ఎస్పీకి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఈ అంశంపై స్పందించిన ఎస్పీ అఖిల్ మహాజన్, ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని సానుకూలంగా హామీ ఇచ్చారని శేఖర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రతినిధులు, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.